
నందమూరి హీరో బాలకృష్ణ ప్రభావంతో తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి
పీలా శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఘర్షణ చోటు
చేసుకోవడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు.
పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు పిలా శ్రీనివాస్‌ను బాబు సస్పెండ్ చేస్తూ
ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ 17 వర్ధంతి సందర్భంగా పెందర్తిలో ఎన్టీఆర్
విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన మాజీ మంత్రి బండారు
సత్యనారాయణమూర్తిని శ్రీనివాస్ వర్గీయులు అడ్డుకుని దాడి చేసిన విషయం
తెలిసిందే.
విశాఖపట్నం పెందుర్తిలో పార్టీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ విషయంలో బాలకృష్ణ
శుక్రవారం వెంటనే స్పందించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని ఆయన
ఫోన్‌లో పరామర్శించారు. దాడి సంఘటనను మనసులో పెట్టుకోవద్దని ఆయన
సత్యనారాయణ మూర్తికి సూచించారు. బండారు సత్యనారాయణ మూర్తిపై దాడి
చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీకి సూచించారు.
వ్యవహారాన్ని క్రమశిక్షణా సంఘం పరిశీలించి, తగిన చర్యలు తీసుకునేలా
చూస్తానని ఆయన బండారుకు హామీ ఇచ్చారు. ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులు
అర్పించడానికి వచ్చిన బండారు సత్యనారాయణ మూర్తిపై పీలా శ్రీనివాస్
వర్గీయులు దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బండారు సత్యనారాయణ
మూర్తి - పీలాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
No comments:
Post a Comment