Search

Wednesday, 20 February 2013

జిఎంఆర్ టు బండ్ల గణేష్: అందరి లెక్క తేల్చేస్తారా?

It Officers Concentrating On Crorepatis
లక్షాధికారులపై ఐటి శాఖ కన్నేసిందట! ముప్పై లక్షల రూపాయలు అంతకన్నా ఎక్కువ విలువైన ఇల్లు కొనుగోలు చేసిన, బ్యాంకులో రూ.10 లక్షల కన్నా ఎక్కువ నగదు డిపాజిట్లు చేసిన వారి చిట్టా సేకరించిందట. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లింపులో లొసుగులను సరి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఐటి(ఆదాయపు పన్ను) శాఖను ఆదేశించింది.
ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున పేరుకు పోయిన ద్రవ్యలోటు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లు అవసరమైన నేపథ్యంలో లొసుగులు సరి చేయాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఐటి శాఖ జల్సారాయుళ్ల పైన, ఆదాయానికి మించి ఖర్చు చేసేవారి పైన, ఆదాయానికి తగ్గ పన్ను కట్టనివారి పైన కన్ను వేసింది. బ్యాంకుల్లో భారీ మొత్తం నగదు నిల్వ ఉండటం, రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడం, విరివిగా క్రెడిట్ కార్డులు వాడటం వంటివి చేసే వారిపై ఐటి శాఖ కన్నేసింది!
ఈ మేరకు మన రాష్ట్రంలోనే లక్షన్నర మందితో కూడిన ఓ జాబితాను ఐటి శాఖ అధికారులు సిద్ధం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఎవరిపై దృష్టి పెట్టాలనే అంశానికి సంబంధించి ఐటి శాఖ ఏడు ప్రమాణాలను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలోని వ్యక్తులు లేదా సంస్థలు చేసే వ్యయానికి, చెల్లించే ఆదాయ పన్నుకు మధ్య పొంతన కుదరట్లేదు. దీంతో వీటి అసలు లెక్క ఏమిటో తేల్చేందుకు ఐటి అధికారులు సిద్ధమవుతున్నారట.
ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం జిఎంఆర్, రాంకీలపై, ఇటీవలే సినీ నిర్మాత బండ్ల గణేష్ పైనా దాడులు చేసి తొలి దశలో రూ.కోటి ముందస్తు పన్ను కట్టించుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఇలా ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించని వారి వివరాలను ఐటి అధికారులు ఇప్పటికే సేకరించి పెట్టుకున్నారట. వీటి ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున అదనపు ఆదాయం పొందేందుకు వీలుగా ఐటి శాఖ కసరత్తు కూడా చేస్తోందట.
ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారట. అయితే, ఐటి శాఖ ప్రధాన లక్ష్యం దాడులు కాదనీ లెక్క ప్రకారం పన్ను చెల్లించని వారి నుంచి అదనపు ఆదాయం పొందడమేననీ తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో తాము తయారు చేసిన జాబితాలోని వారికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. అప్పటికీ పన్ను చెల్లించేందుకు ముందుకు రాకపోతే, అప్పుడు దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయట.

No comments:

Post a Comment

Popular Posts