Search

Wednesday 20 February 2013

సంజయ్‌ దత్‌ చిత్రంపై నిరసనలు,ధర్నాలు

Sanjay Dutt Zilla Ghaziabad Trouble జిల్లా ఘజియాబాద్‌ చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌కు విరుద్ధంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. పలు సంఘాలు నిరసనలు తెలుపుతూ ఘజియాబాద్‌ గూండాల రాజ్యం కాదంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ఇక్కడ ప్రాణాలు అర్పించేవారు కనిపిస్తారంటూ నినాదాలు చేశారు. ఈ చిత్రం నగరంలోని యువతను నేరాలకు పాల్పడేలా ఉత్తేజం కలిగిస్తుందని పేర్కొన్నారు.

మరో ప్రక్క ఘజియాబాద్‌ ప్రాంతంమీద తీసిన 'జిల్లా ఘజియాబాద్‌' చిత్రం గురించి కథారచయిత వినయ్‌ శర్మ, డైరెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ సహిబాబాద్‌ ప్రాంతంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ చిత్రంలో అవమాన పరిచేవిధంగా ఎలాంటి సన్నివేశాలు లేవన్నారు. పోలీస్‌ అధికారిగా నటించిన శీతక్‌ సింగ్‌, గ్యాంగ్‌వార్‌లో ప్రధాన భూమిక పోషించిన మహేంద్ర పౌజీ, సత్‌వీర్‌ గుర్జర్‌తోపాటు రచయిత వినయ్‌ శర్మ ఈప్రాంతానికి చెందినవారే కావటం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.
తాము ఈప్రాంతానికి చెందిన వాళ్లం కాబట్టి ఘజియాబాద్‌ కించపర్చాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదన్నారు. ఘజియాబాద్‌ అతి కష్టం మీద మోడ్రన్‌ మెట్రో కల్చర్‌ ప్రాంతంగా మారిందని, మీరు మళ్లీ ఘజియాబాద్‌ ప్రాంతం నేరాలకు అడ్డాగా తయారు చేస్తున్నారని ఒక విలేకరి అభిప్రాయపడ్డాడు. దీనివలన ప్రాపర్టీ విలువ కూడా పడిపోతుందని అన్నాడు. దీనికి డైరెక్టర్‌ సమాధానమిస్తూ చిత్రం ద్వారా ఘజియాబాద్‌ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తుందని, ఇది ఉత్తరప్రదేశ్‌కు కూడా మంచిదేనని తెలిపారు. ఈ చిత్రంలో నేరాలుకు సంబంధించిన అంశాలు చాలా తక్కువగా కామెడీ ప్రధానంగా వుందని వెల్లడించారు.
ఘజియాబాద్‌లోని రెండు శత్రువర్గాల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే 'జిల్లా ఘజియాబాద్‌' చిత్రం రూపొందించారని తెలుస్తోంది. అయితే దర్శకుడు ఆనంద్‌కుమార్‌ అయితే ''ఒక సాధారణ కథలోని సంఘటనలు ఏరుకుని దానికి మెరుగులుదిద్ది ఒక కమర్షియల్‌ చిత్రం ఇతివృత్తంగా రూపొందించామే గాని, ఈ చిత్రం ఎవరి ఆత్మకథ కాదు'' అని ఆ మధ్య అన్నారు. అంతేకాదు తాను రైల్వేస్టేషన్లో ఓ సాయంత్రం నిరీక్షిస్తుంటే టీవి స్క్రీన్‌ మీద పడే సూర్య కిరణాల మధ్య పసుపురంగు బోర్డ్‌పై 'జిల్లా ఘజియాబాద్‌' అని కనిపించడం ఓ ప్రత్యేక అనుభూతిని యిచ్చిందని ఆక్షణాన్నే ఈ టైటిల్‌తో చిత్రం చేయాలనుకుని రిజిస్టర్‌ చేయించానని ఈ అంశాల గురించి ఒక రాజకీయ మిత్రుడితో చర్చిస్తుంటే ఘజియాబాద్‌కి చెందిన సత్బీర్‌ గుర్జార్‌, మహేందర్‌ ఫౌజీ కథను చెప్పాడని దాన్నించి ప్రేరణ చెంది ఈ కథ తయారు చేసుకున్నామని ఇది కల్పిత కథ అని వాస్తవ సంఘటనలు లేవని చెప్పారు.
ఘజియాబాద్‌ జిల్లాలోని ప్రీతమ్‌సింగ్‌ అనే పోలీస్‌ అధికారి అసాంఘిక శక్తులకు హడల్‌. నేరస్తులను పట్టుకోడానికి, వారి నుంచి నిజాలు రాబట్టడానికి చట్ట పరిధిలోలేని అంశాలను, పోలీసులు ఉపయోగించని చిట్కాలు ఉపయోగించి వాళ్ళనుంచి నిజాలు కక్కించేవాడు. అతడు చనిపోయి పధ్నాలుగు సంవత్సరాలైనా ఆ జిల్లాలోని ప్రజలు మరిచిపోలేదు.
ప్రీతమ్‌సింగ్‌గా సంజయ్‌దత్‌, సత్బీర్‌ గుర్జాల్‌గా వివేక్‌ ఓబెరాయ్‌, మహేందర్‌ ఫౌజిగా అర్షాద్‌ వార్సీ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలిసుకున్న ప్రీతమ్‌సింగ్‌ అభిమానులు, ప్రీతమ్‌సింగ్‌ అన్న ఎస్‌.పి.సింగ్‌ ప్రభృతులు ఈ చిత్రంకి సంబంధించిన ప్రతి అంశం తమకు తెలియాలని ప్రీతమ్‌సింగ్‌ పాత్రను ఎలా తీర్చిదిద్దారో తెలపాలని, చట్టానికి బద్ధుడైన వాడిగానే చూపాలి తప్ప మరోరకంగా చూపడానికి వీల్లేదని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. నిర్మాత వినోద్‌ బచ్చన్‌ అయితే ఈ సినిమా అందరిలోనూ ఉత్కంఠ రేపిన కారణంగా ఎంక్వయిరీలు ఎక్కువగానే ఉన్నాయని గతంలో ఒకసారి చెప్పారు.

No comments:

Post a Comment