Search

Friday 15 February 2013

చమ్మక్ చల్లో – ప్రేమకి లాజిక్ లేదు, సినిమాలో మేజిక్ లేదు

    విడుదల తేదీ : 15 ఫిబ్రవరి 2013

దర్శకుడు : నీలకంఠ
నిర్మాత : డి.ఎస్.రావు
సంగీతం : కిరణ్ వారణాసి
నటీనటులు : వరుణ్ సందేశ్, సంచిత పడుకొనే, కేథరిన్

షో, మిస్సమ్మ సినిమాలతో వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నీలకంఠ ఆ తరువాత ట్రాక్ తప్పాడు. సదా మీ సేవలో, విరోధి లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నా కమర్షియల్ గా మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేవు. దీంతో ట్రాక్ మార్చి రొటీన్ కమర్షియల్ సినిమాగా చమ్మక్ చల్లో చేసాడు. వరుణ్ సందేశ్, సంచిత పడుకొనే, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఈ చమ్మక్ చల్లో ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి విసుగొచ్చి ఇండియాకి వచ్చి తెలుగులో కొత్తగా ఏదైనా సినిమా తీద్దామనుకున్న కిషోర్ (అవసరాల శ్రీనివాస్) ఒక నిర్మాతని కలిస్తే లవ్ స్టొరీ చేద్దామని సలహా ఇస్తాడు. సరికొత్త లవ్ స్టొరీ కోసం వెతుకులాటలో లెక్చరర్ అప్పారావు అగర్వాల్ (షాయాజీ షిండే) కలుస్తాడు. కిషోర్ తీయబోయే సినిమా కోసం తన కాలేజీలో జరిగిన ఒక ప్రేమ కథని కిషోర్ కి చెప్పడం ప్రారంభిస్తాడు. ఇంజనీరింగ్ చదువుతున్న శ్యామ్ (వరుణ్ సందేశ్), అన్షు (సంచిత పడుకొనే) ఇద్దరూ మంచి స్నేహితులు. అప్పారావు అగర్వాల్ వారిని స్నేహాన్ని ప్రేమగా మారడానికి పునాది వేస్తాడు. కాలక్రమంలో ప్రేమలో పడ్డాక ఇద్దరి కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్ధం కూడా చేస్తారు. ఇప్పటి వరకు బాగానే ఉంది మరి కథలో ట్విస్ట్ లేదు కదా! ఇప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది. ఆ సమస్య ఏమిటి అనేది చమ్మక్ చల్లో మూల కథ.
ప్లస్ పాయింట్స్ :
సంచిత పడుకొనే కొన్ని యాంగిల్స్ లో బాగానే ఉంది. క్లోజ్ అప్ షాట్స్ లో మేకప్ బాగా ఎక్కువైంది కానీ నవ్వితే పర్వాలేదు. కేథరిన్ నటన శూన్యం కానీ స్కిన్ షో మాత్రం అడగకపోయినా అందాలు ఆరబోసేందుకు ట్రై చేసింది. మిగతా వారిలో వెన్నెల కిషోర్ కొద్దిసేపు నవ్వించే ప్రయత్నం చేసాడు. శ్యాం స్నేహితులలో నత్తివాడిగా చేసిన అబ్బాయి కూడా బాగానే నవ్వించాడు. అవసరాల శ్రీనివాస్ పాత్ర చాలా చిన్నది ఉన్నంతసేపు పర్వాలేదనిపించాడు. మిగతావారిలో బ్రహ్మాజీ, సురేఖ వాణి అందరూ రొటీన్ రొటీన్.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు నీలకంఠకి గతంలో విలక్షణ దర్శకుడిగా చాలా మంచి పేరు ఉంది. లవ్ కి లాజిక్ లేదు అంటూ రొటీన్ లవ్ స్టొరీ ఎంచుకుని మొదట్లోనే పట్టాలు తప్పాడు. రొటీన్ స్టొరీని ఎంచుకున్నపుడు కథనం అయినా కొత్తగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం ప్రేమికుల మధ్యలోకి మరో వ్యక్తి ప్రవేశించి మనస్పర్ధలు అపార్ధాలు ఈ కథతో ఇప్పటికి లెక్క లేనన్ని సినిమాలు వచ్చాయి. సన్నివేశాలైనా ఆసక్తిగా ఉంటే ప్రేక్షకుడు సీట్లో కూర్చోగలుగుతాడు. ప్రేమికులు మధ్య ఇగో సమస్యల్ని వారి అమాయకత్వం జోడించి నటీ నటుల ప్రదర్శన అయినా బావుంటే ఒడ్డున పడేయవచ్చు. ఎవరికి వారు చేతులెత్తేయడంతో పడవ కాస్తా నది సముద్రం మధ్యలో మునిగింది. వరుణ్ సందేశ్ రొటీన్ సినిమాలు ఎంచుకుంటూ నటన మీద ఆసక్తి లేకపోగా నటన కూడా నిర్లక్ష్యమే. కేథరిన్ సొంత డబ్బింగ్ చెప్పాలనుకోవడం మంచిదే కానీ కనీసం హోం వర్క్ చేయకుండా డబ్బింగ్ చెప్పడం అస్సలు బాలేదు. అతడి మొదటి సినిమా నుండి అదే నటన తప్ప ఇంత వరకు మార్పు లేదు. సినిమా మొదటి నుండి చివరి వరకు ఒకేలాగా ఏ మాత్రం కలిగించలేదు.
సాంకేతిక విభాగం :
కిరణ్ వారణాసి అందించిన పాటల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వినసొంపుగా లేవు. పైగా చందమామ పై కుందేలా, కత్రినా, చమ్మక్ చల్లో పాటలు సహనానికి పరీక్ష పెట్టాయి. నేపధ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. ఇంకోసారి, విరోధి లాంటి సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన రంగనాథ్ గోగినేని ఈ సినిమాలో లోక్వాలిటీతో ఉంది. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు.
తీర్పు :
అందరూ చేసే సినమాలు మనం చేయకూడదు, ఏదైనా కొత్తగా చేస్తే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అందరూ తీసే రొటీన్ లవ్ స్టొరీ సినిమాలు నీలకంఠ లాంటి దర్శకులు కూడా చేయడం మొదలుపెడితే ఫలితాలు ఇలాగె ఉంటాయి. నీలకంఠ ఇకనైనా ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకుంటే బెటర్.

No comments:

Post a Comment

Popular Posts